CPI Ramakrishna: మోదీ, అమిత్ షా చెబితే కాదనే దమ్ము జగన్ కు ఉందా?: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna speech at farmers rally

  • తిరుపతిలో అమరావతి రైతుల మహోద్యమ సభ
  • హాజరైన సీపీఐ రామకృష్ణ
  • ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
  • విపక్షాలన్నీ అమరావతినే కోరుకుంటున్నాయని వ్యాఖ్య 

తిరుపతిలో రైతుల మహోద్యమ సభకు హాజరైన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రసంగించారు. వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. రాజధాని అంశంలో జగన్ రెండేళ్లుగా నిప్పుల కుంపటి రాజేశారని విమర్శించారు. తాను తిరుపతి సభకు వస్తుంటే అడ్డుకున్నారని రామకృష్ణ ఆరోపించారు. అటు అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అనేకమందిని జైళ్లలో తోశారని పేర్కొన్నారు.

ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా వంటి పలు ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని, ముందు వాటిని అభివృద్ధి చేయాలని రామకృష్ణ హితవు పలికారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నమాట నిజమేనని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల నుంచి పొట్టచేతపట్టుకుని వలస వెళుతుంటారని వివరించారు.

"ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయండి. ఆ పని చేయకుండా, రాజధానిని విడగొడతాం, మూడు ముక్కల ఆట ఆడతాం, అందర్ బాహర్ ఆట ఆడతాం, ప్రాంతాల మధ్య చిచ్చుపెడతాం అంటున్నారు.  రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అమరావతి రాజధానిగా ఉండాలి అని కచ్చితంగా చెబుతున్నాం. ఇవాళ అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు? ఎవరి దమ్ము చూసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు?" అంటూ రామకృష్ణ నిప్పులు చెరిగారు.

"అమరావతి రాజధానికి ఏపీ బీజేపీ నేతలు కూడా మద్దతిస్తున్నారు. కేంద్రంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. నేను బీజేపీ నేతలను విమర్శించను గానీ, ఒక్క మాట చెబుతాను. అమిత్ షా గనుక ఒక్క ఫోన్ కాల్ చేస్తే జగన్ లేచి నిలబడి శిరసావహిస్తాడు. ప్రధాని నరేంద్ర మోదీ చెబితే కాదనే దమ్ము జగన్ మోహన్ రెడ్డికి ఉందా? కాబట్టి జగన్ కు వారే చెప్పాలి" అంటూ సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో స్పందించారు.

  • Loading...

More Telugu News