CPI Narayana: స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదే!: సీపీఐ నారాయణ వ్యంగ్యం
- తిరుపతిలో రైతుల సభ
- రాజధాని ఏదంటే చెప్పలేకపోతున్నామన్న నారాయణ
- జగన్ ది మూర్ఖత్వం అంటూ వ్యాఖ్యలు
- సీపీఐ ఎప్పుడూ మాట మార్చలేదని ఉద్ఘాటన
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో రైతుల సభకు హాజరయ్యారు. ఏపీ రాజధాని అంశంలో సీఎం జగన్ పై ఆయన తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తర భారతదేశానికి వెళితే మీ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ఏదంటే చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకావడంలేదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని విమర్శించారు.
అమరావతిని రాజధానిగా చేస్తున్నామంటేనే రైతులు భూములు ఇచ్చారని నారాయణ అన్నారు. కానీ అమరావతి అనే శిశువును జగన్ మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. మూర్ఖత్వంలో జగన్ ను మించినవారు మరొకరు ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. రాజధాని అంశంపై సీపీఐ మొదటి నుంచి ఒకే మాట చెబుతోందని, తాము ఇప్పటివరకు మాట మార్చలేదని నారాయణ ఉద్ఘాటించారు.