KR Ramesh Kumar: నష్టనివారణ చర్యల్లో కాంగ్రెస్.. రమేశ్ కుమార్ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ క్షమాపణ
- అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆస్వాదించడమే మేలని వ్యాఖ్యలు
- సర్వత్ర విమర్శలు
- రాష్ట్ర మహిళలందరికీ శివకుమార్ క్షమాపణ
- పార్టీ విలువలకు ఇలాంటివి విరుద్ధమని వివరణ
అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆస్వాదించడమే మేలని వ్యాఖ్యానించిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. మహిళలను కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తమ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు.
మరోమారు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నానన్న ఆయన.. కర్ణాటక అధ్యక్షుడిగా పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. రమేశ్ కుమార్ వ్యాఖ్యలు పార్టీ విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. మరోవైపు, అసెంబ్లీలో స్పీకర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రమేశ్ కుమార్ కూడా స్పందించారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధిస్తే క్షమించాలని వేడుకున్నారు.