Cheddi Gang: గుజరాత్‌లో చిక్కిన చెడ్డీగ్యాంగ్.. విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు

Vijayawada police arrested Cheddi gang in gujarat

  • ముఠా సభ్యుల నుంచి డబ్బు, బంగారం స్వాధీనం
  • పరారీలో ఉన్న మిగతా ఏడుగురి కోసం గాలింపు
  • పెళ్లిలో కలుసుకుని చోరీలకు ప్లాన్
  • విజయవాడలో చోరీల అనంతరం తిరిగి గుజరాత్‌కు

విజయవాడ, గుంటూరు వాసులను భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గుజరాత్‌లో పట్టుబడిన ముగ్గురు సభ్యులను విజయవాడ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. నిజానికి వీరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వారిని విచారిస్తున్న పోలీసులు మరికొందరు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారని, వారిని కూడా పట్టుకున్న తర్వాత అరెస్ట్ చూపిస్తారని వార్తలు బయటకొచ్చాయి. తాజాగా, చెడ్డీగ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసు బృందం గాలిస్తోంది. నిందితుల నుంచి రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 10మంది దొంగలు గత నెల 22న ఓ పెళ్లి విందులో కలుసుకున్నారు. అందరూ కలిసి దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే రైలులో చెన్నై చేరుకుని, అక్కడి నుంచి 28న రైలులో విజయవాడ చేరుకున్నారు. అక్కడ ఐదుగురేసి చొప్పున ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి తిరిగి గుజరాత్ వెళ్లిపోయినట్టు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.

చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తూర్పు మండలం డీసీపీ హర్షవర్ధన్ రాజు, సీసీఎస్ ఇన్‌చార్జ్ కొల్లి శ్రీనివాస్, పశ్చిమ ఏసీపీ హనుమంతరావును ఆయన అభినందించారు.

  • Loading...

More Telugu News