WHO: సీరం కోవావ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి
- కరోనాపై పోరులో మరో టీకా అందుబాటులోకి
- భారత్‌లో వినియోగానికి డీసీజీఐ అనుమతులు తప్పనిసరి
- వైరస్‌పై అద్భుతంగా పనిచేస్తోందన్న సీరం సీఈవో
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేసిన పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ తాజాగా తీసుకొచ్చిన కొవావ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.
అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ నుంచి లైసెన్స్ పొందిన సీరం సంస్థ ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతులపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందిస్తూ.. కరోనాపై పోరుకు మరో టీకా అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
తాజా వ్యాక్సిన్ కోవావ్యాక్స్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు లభించినప్పటికీ మన దేశంలో వినియోగానికి మాత్రం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి తప్పనిసరి. త్వరలోనే దీని నుంచి అనుమతులు లభిస్తాయని సీరం ఆశాభావం వ్యక్తం చేసింది.