Afghanistan: పడిపోయిన కరెన్సీ విలువ.. ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలు
- ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వల్ల ప్రతికూల పరిస్థితులు
- 2.28 మంది ప్రజలకు ఆహార కొరత
- గతంలో 8 డాలర్లు ఉన్న వంట నూనె డబ్బా ఇప్పుడు 18 డాలర్లు
ఆఫ్ఘనిస్థాన్‌లో పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఆ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కరెన్సీ విలువ సైతం పడిపోతోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా ఇప్పుడు తాలిబన్ల పాలన కారణంగా కరెన్సీ విలువ పతనాన్ని కూడా చవిచూస్తుండడంతో ఆ దేశ ప్రజల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
ఆప్ఘన్ జనాభాలో సగం మందికి పైగా ఆకలి బాధను ఎదుర్కొంటున్నారు. 3.28 కోట్ల మంది ఆఫ్ఘన్ ప్రజల్లో 2.28 మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్డీపీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఆఫ్ఘన్ కరెన్సీ 'ఆఫ్ఘనీ' ఒక డాలరుకు 80 ఆఫ్ఘనీలుగా ఉండేది. గత సోమవారం అది 123 ఆఫ్ఘనీలకు పడిపోయింది. గురువారం నాటికి అది 100 ఆఫ్ఘనీలకు చేరింది.
ఆఫ్ఘన్ లో డాలర్ల కొరత కూడా ఏర్పడింది. దీంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గతంలో 8 డాలర్లు ఉన్న వంట నూనె డబ్బా ఇప్పుడు 18 డాలర్లుగా ఉంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన కారణంగా అమెరికాతో పాటు పలు దేశాలు తమ బ్యాంకుల్లో ఉన్న వందల డాలర్ల ఆఫ్ఘన్ ప్రభుత్వ నిధులను స్తంభింపజేసిన విషయ తెలిసిందే. అంతేగాక, ఆఫ్ఘన్‌కు 45 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నిలిపేయడంతో ఆ దేశం మరిన్ని కష్టాల్లో పడింది. ఆఫ్ఘన్‌ను ఆదుకోవాలంటూ ఆ దేశ కేంద్ర బ్యాంకు మాజీ గవర్నర్ ఖాన్ అఫ్జల్ హదావల్ అంతర్జాతీయ సంస్థలను కోరారు.