Somireddy Chandra Mohan Reddy: ఇప్పటికీ జగన్ మనస్సు కరగకపోవడం దురదృష్టకరం: సోమిరెడ్డి
- అమరావతి రైతుల తిరుపతి సభ చరిత్ర సృష్టించింది
- భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజలందరూ రైతులకు అండగా నిలిచారు
- అమరావతికి అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోవాలి
తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ చరిత్ర సృష్టించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో సభ విజయవంతమయిందని చెప్పారు. అకుంఠిత దీక్షతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషమని అన్నారు. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజాసంఘాలన్నీ అమరావతికి జైకొట్టాయని చెప్పారు.
అధికార వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు పెట్టినా, ఆటంకాలు సృష్టించినా భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజలందరూ అమరావతి వైపే నిలిచారని సోమిరెడ్డి అన్నారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుందని చెప్పారు.
అమరావతి రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా జగన్ మనసు కరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. మంచి మనస్సు చేసుకోకపోగా రైతుల సభకు పోటీగా వికేంద్రీకరణ సభ పెట్టి కాలేజీల యాజమాన్యాలను బెదిరించి, విద్యార్థులను తరలించి గబ్బు పట్టడం అవసరమా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే పాలనలో ఘోరంగా విఫలమయ్యారని... ఇకనైనా కళ్లు తెరిచి అప్పట్లో ప్రతిపక్ష నేతగా మీరు మద్దతు పలికిన అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ ను సోమిరెడ్డి కోరారు. లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పారు.