CJI NV Ramana: హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ
- నానక్ రామ్ గూడ ఫినిక్స్ టవర్స్ లో ఐఏఎంసీ ఏర్పాటు
- సీఎం కేసీఆర్ తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ
- కార్యక్రమంలో పాలొన్న సుప్రీంకోర్టు జడ్జిలు, మంత్రులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాదులో నేడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నానక్ రామ్ గూడలోని ఫినిక్స్ వీకే టవర్స్ లో ఐఏఎంసీని ఏర్పాటు చేశారు. నేడు నగరానికి విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఐఏఎంసీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ, నగరంలో ఐఏఎంసీ ఏర్పాటవడం హర్షణీయమని, ప్రారంభోత్సవంలో తాను పాల్గొనడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించగానే సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారని అభినందించారు. కోర్టు వెలుపల రాజీ, మధ్యవర్తిత్వం వంటి సామరస్య పూర్వక ప్రయత్నాలకు ఐఏఎంసీ ఉపయోగపడుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.