Shaadi Dot Com: ఇకపై వారికి కూడా ప్రత్యేక మ్యాట్రిమొనీ విభాగం... షాదీ డాట్ కామ్ కీలక నిర్ణయం
- ఎల్జీబీటీక్యూ వర్గానికి కూడా మ్యాట్రిమొనీ
- స్వలింగ వివాహాలపై గతంలో సుప్రీంకోర్టు సానుకూలత
- కీలక ముందడుగు వేసిన షాదీ డాట్ కామ్
- ఎల్జీబీటీక్యూ వారి కోసం ప్రత్యేక విభాగం
పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యాట్రిమొనీ సంస్థ షాదీ డాట్ కామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా మ్యాట్రిమొనీ సేవలు అందించనుంది. అందుకోసం దేశంలో ప్రప్రథమంగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్) వర్గం పరిధిలోకి వచ్చే వారికోసం ప్రత్యేకంగా ఓ మ్యాట్రిమొనీ వేదికను ప్రారంభిస్తున్నట్టు షాదీ డాట్ కామ్ వెల్లడించింది.
విదేశాల్లో నివసించే వారు కూడా ఈ వేదిక ద్వారా మ్యాట్రిమొనీ సేవలు పొందవచ్చని వివరించింది. వివిధ రకాల జెండర్ లను, దేశాలను, ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయానికి వచ్చినట్టు ఈ మ్యాట్రిమొనీ సంస్థ పేర్కొంది. అవసరం అయిన వాళ్లకు తోడు అందించడం అనేది తమ సంస్థ ప్రధాన ఉద్దేశం అని షాదీ డాట్ కామ్ సీఈఓ అనుపమ్ మిట్టల్ వెల్లడించారు. తాజా నిర్ణయంతో ఎదురయ్యే విమర్శలను తాము పట్టించుకోబోమని తెలిపారు.