Pubs: హైదరాబాదులోని 10 పబ్ లపై హైకోర్టులో పిటిషన్
- జనావాసాల మధ్య పబ్ లు ఉన్నాయంటూ పిటిషన్
- చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- రాత్రి 10 తర్వాత కూడా సంగీతం హోరుపై ఫిర్యాదు
వికృత చేష్టలకు ఆవాసంగా మారుతోందంటూ ఇటీవల హైదరాబాదులోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడం తెలిసిందే. దాంతో నగరంలోని పబ్ లు, పబ్ ల సంస్కృతి చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని 10 పబ్ లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనావాసాల మధ్య పబ్ లు ఉన్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాత్రి 10 తర్వాత పబ్ లలో సంగీతం నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ పేర్కొన్నారు.
ఫర్జీ కేఫ్, అమ్నేషియా లాంజ్, 800 జూబ్లీ, డైలీ డోస్ బార్, హై లైఫ్, బ్రాడ్ వే, మాకోబ్రూ వరల్డ్ కాఫీ, హాట్ కప్ కాఫీ, డర్టీ మార్టిన్ తదితర పబ్ లను ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.