Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి యువకుడి వీరంగం.. కొట్టి చంపిన భక్తులు
- బంగారు కడ్డీలను దాటి లోపలికి ప్రవేశం
- కత్తి తీసుకుని పూజారి వద్దకు వెళ్లి హల్‌చల్
- దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ భక్తుల ఆగ్రహం
- మూకుమ్మడిగా దాడిచేసిన భక్తులు
- విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి
సిక్కులకు ఎంతో పవిత్రమైన పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో నిన్న సాయంత్రం ఊహించని ఘటన జరిగింది. ఓ యువకుడు (25) దేవాలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోకి చొరబడ్డాడు. బంగారు కడ్డీలతో ఏర్పాటు చేసిన కంచె మీదుగా లోపలికి దూకి అక్కడున్న కత్తిని చేతపట్టాడు. అక్కడే ఓ మూలన పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ చదువుతున్న పూజారి వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేశాడు. గర్భగుడిలోకి ప్రవేశించడమంటే దైవద్రోహానికి పాల్పడినట్టుగా సిక్కులు భావిస్తారు.
గర్భగుడిలోకి వెళ్లి కత్తితో హంగామా చేసిన అతడిని పట్టుకున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) టాస్క్‌ఫోర్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం కమిటీ కార్యాలయానికి అతడిని తరలిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా అతడిపై దాడిచేశారు. వారి దెబ్బలకు తాళలేని యువకుడు మృతి చెందాడు. బాధిత యువకుడిది ఉత్తరప్రదేశ్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. యువకుడు ఆలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు? ఒక్కడే వచ్చాడా? అతడివెంట మరెవరైనా ఉన్నారా? అతడు ఎవరు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ విచారణకు ఆదేశించారు.