Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సంచలనం.. పతకం ఖాయం
- స్పెయిన్‌లోని వెల్వాలో వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు
- భారత్‌కే చెందిన లక్ష్యసేన్‌తో పోరాడి గెలిచిన శ్రీకాంత్
- ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి ఇండియన్ పురుష షట్లర్‌గా రికార్డు
- గెలిచినా, ఓడినా మరో రికార్డు
స్పెయిన్‌లోని వెల్వాలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. ఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్యసేన్‌తో జరిగిన సెమీస్ పోరులో పోరాడి విజయం సాధించిన శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి ఇండియన్ పురుష షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఫైనల్లో గెలిచి స్వర్ణం సాధిస్తే మరో రికార్డు అతడి సొంతమవుతుంది. ఓడినా కనీసం రజత పతకం దక్కుతుంది.
లక్ష్యసేన్‌తో జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ 17-21, 21-14, 21-17తో పోరాడి విజయం సాధించాడు. తొలి సెట్‌ను చేజార్చుకున్న శ్రీకాంత్.. ఆ తర్వాత విజృంభించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పదునైన స్మాష్‌లు, క్రాస్‌కోర్డు షాట్‌లతో లక్ష్యసేన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి విజయం సాధించి చరిత్ర సృష్టించాడు.
శ్రీకాంత్ చేతిలో ఓడిన లక్ష్యసేన్‌కు కాంస్య పతకం సొంతమైంది. ఇది కూడా ఓ రికార్డే. ఈ పతకంతో లక్ష్యసేన్ దిగ్గజ ఆటగాళ్లు ప్రకాష్ పదుకొనే, బి.సాయిప్రణీత్ సరసన చేరాడు. ప్రకాష్ పదుకొనే 1983లో, సాయిప్రణీత్ 2019లో కాంస్య పతకాలు అందుకున్నారు. అలాగే, ఇదే చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన మహిళా షట్లర్‌లలో పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప కూడా ఉన్నారు.