Punjab: పంజాబ్ లో మరో ఘటన... నిషాన్ సాహిబ్ ను అపవిత్రం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులు
- గతరాత్రి అమృత్ సర్ లో ఓ వ్యక్తి బీభత్సం
- కొట్టి చంపిన భక్తులు
- ఈ ఉదయం మరో ఘటన
- కపుర్తలా జిల్లాలో ఓ గురుద్వారాలో ప్రవేశించిన వ్యక్తి
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో గతరాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపడం తెలిసిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన ఆ యువకుడిపై భక్తులు ఒక్కసారిగా దాడి చేసి హతమర్చారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పంజాబ్ లో అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది.
కపుర్తలా జిల్లాలోని నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి గురుద్వారాలో చొరబడినట్టు గ్రామస్తులు గుర్తించారు. సిక్కుల పవిత్ర పతాకం నిషాన్ సాహిబ్ ను అతడు అపవిత్రం చేస్తూ వారి కంటబడ్డాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిక్కు సంఘాలు మాత్రం అతడిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టాయి.
అయితే అతడిని అక్కడినుంచి తరలించే యత్నంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్తులు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. అమృత్ సర్ లో ఘటన జరిగిన 24 గంటల్లోపే మరో ఘటన జరగడంతో పంజాబ్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.