Akhilesh Yadav: సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన అఖిలేశ్ యాదవ్
- సమాజ్ వాదీ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు
- తీవ్రస్థాయిలో స్పందించిన అఖిలేశ్
- తమ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం
- వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపాటు
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ధ్వజమెత్తారు. తమ ఫోన్లను సీఎం ఆదిత్యనాథ్ ట్యాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. "మా ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయి. మా సంభాషణలను రికార్డు చేస్తున్నారు. మా పార్టీ ఆఫీసులో ఉన్న అన్ని ఫోన్లపై నిఘా వేశారు. రహస్యంగా మా మాటలు వింటున్నారు. ట్యాపింగ్ చేసిన ఫోన్లలోని సంభాషణల్లో కొన్నింటిని సాయంత్రం వేళల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వింటున్నారు. ఎవరైనా మమ్మల్ని కలిస్తే చాలు... వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తున్నారని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదన్న ఉద్దేశంతో వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. నిన్న సమాజ్ వాదీ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.