Omicron: బ్రిటన్ లో ఒమిక్రాన్ విలయతాండవం.... మూడు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు

Omicron daily cases flooded in Britain
  • బ్రిటన్ లో ఒక్కరోజులో 90 వేలకు పైగా కరోనా కేసులు
  • వాటిలో ఒమిక్రాన్ కేసులు 10 వేలు
  • వెల్లువలా వస్తున్న కొత్త వేరియంట్ కేసులు
  • క్రిస్మస్ తర్వాత లాక్ డౌన్ విధించే అవకాశం
బ్రిటన్ లో ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఒక్కరోజులో 10 వేల ఒమిక్రాన్ కేసులు వెల్లడి కావడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. గత 24 గంటల్లో బ్రిటన్ లో 90,418 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మిగతా దేశాల కంటే ప్రస్తుతం బ్రిటన్ లో అత్యధిక స్థాయిలో రోజువారీ కేసులు వస్తుండడం, వాటిలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా ఉండడం అక్కడి ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.  

అటు ఒమిక్రాన్ తో మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్ లో సంభవించడం తెలిసిందే.

ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ నడుస్తుండగా, మరికొన్నిరోజుల్లో నూతన సంవత్సరాది వస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తుండడం బ్రిటన్ ప్రభుత్వాన్ని సంకట స్థితిలోకి నెడుతోంది. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ విధిస్తే పండుగ వేళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని, అందుకే క్రిస్మస్ ముగిసిన తర్వాత లాక్ డౌన్ విధించాలని భావిస్తోంది.

ఒమిక్రాన్ విజృంభణపై బ్రిటన్ ఆరోగ్యమంత్రి సాజిద్ జావిద్ మాట్లాడుతూ, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, అయితే చాలా కేసుల్లో ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేకపోవడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. మరికొన్ని కేసుల్లో వెంటిలేటర్ అవసరం ఉండడంలేదని పేర్కొన్నారు.
Omicron
Britain
New Cases
Corona Virus

More Telugu News