Pushpa: మూడో రోజూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' వసూళ్ల వివరాలు ఇవిగో
- ప్రపంచ వ్యాప్తంగా రూ.173 కోట్ల గ్రాస్
- హిందీలోనూ దూసుకుపోతోన్న 'పుష్ప'
- మూడు రోజుల్లో రూ.12 కోట్లు వసూల్
బాక్సాఫీస్ వద్ద మూడో రోజు కూడా 'పుష్ప' సినిమా తగ్గేదేలే.. వసూళ్లలో పుష్ప రాజ్ దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో సుకుమార్ రూపొందించిన ఈ సినిమా మూడో రోజు (ఆదివారం) కూడా రికార్డులు బద్దలు కొట్టిందని, 2021లో ఇండియాలో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచిందని పుష్ప టీమ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.173 కోట్లు సాధించిందని వివరించింది. కరోనా సమయంలోనూ గతంలోని రికార్డులన్నింటినీ 'పుష్ప' బద్దలు కొడుతూ దూసుకుపోతుండడం గమనార్హం. నిన్న, మొన్న సెలవు దినాలు కావడంతో పుష్పను చూడడానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు.
మరోవైపు, స్పైడర్ మ్యాన్ వంటి హిట్ మూవీ హిందీ సినిమా థియేటర్లను షేక్ చేస్తున్నప్పటికీ పుష్ప రాజ్ హిందీలోనూ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్నాడు. శుక్రవారం రూ.3 కోట్లు, ఆదివారం రూ.4 కోట్లు, ఆదివారం రూ.5 కోట్ల గ్రాస్ సాధించింది పుష్ప సినిమా. హిందీలో మూడు రోజుల్లో మొత్తం రూ.12 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.
అల్లు అర్జున్ నటించిన గత సినిమా 'అల వైకుంఠపురములో' కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప'పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకోవడంతో థియేటర్లు నిండిపోతున్నాయి.