Singireddy Niranjan Reddy: అందుకే మేము ఢిల్లీకి వచ్చాం.. ఇక్కడే వేచిచూస్తాం: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి
- ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి
- దీనిపై కేంద్ర సర్కారుతో మాట్లాడతాం
- మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి
- రైతుల ప్రయోజనం కోసమే తమ పర్యటన అన్న మంత్రి
తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ సందర్భంగా మంత్రులు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాము తెలంగాణ రైతుల ప్రయోజనం కోసమే ఢిల్లీకి వచ్చామని చెప్పారు. ఢిల్లీకి రాజకీయం చేయడానికి రాలేదని, అక్కడ తమను వేచి చూసేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమేనని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి ఢిల్లీకి వచ్చిన తమకు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేవరకు తాము ఎదురు చూస్తూనే ఉంటామని చెప్పారు.
గత యాసంగిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ధాన్యం టార్గెట్ ఎంత? చివరకు కొన్నది ఎంత? అని ఆయన నిలదీశారు. తాము తెలంగాణలో వరి ధాన్యం కోసం ఆరు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వానాకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణలో తాము 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్ నేటితో పూర్తవుతుందని తెలిపారు.
అయితే, పండించే ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొంటుందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, బియ్యం మిల్లింగ్ తరువాత ఇతర ప్రాంతాలకు వాటిని తరలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాగా, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నేడు ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.