Kidambi Srikanth: సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్
- వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో శ్రీకాంత్ కు రజతం
- చరిత్ర సృష్టించిన వైనం
- పోరాడి ఓడాడన్న సీఎం జగన్
- నిరంతరం ప్రోత్సహిస్తున్నారంటూ బదులిచ్చిన శ్రీకాంత్
తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజతం సాధించి భారత బ్యాడ్మింటన్ రంగంలో చరిత్ర సృష్టించడం తెలిసిందే. స్పెయిన్ లోని హెల్వాలో నిన్న జరిగిన ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. టైటిల్ సమరంలో సింగపూర్ షట్లర్ లో కీన్ యే చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితేనేం... భారత్ తరఫున ప్రపంచ చాంపియన్ షిప్ పురుషుల విభాగంలో రజతం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.
దీనిపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. 'బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్-2021 ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చారిత్రక రజతం గెలిచిన మన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు శుభాభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. శ్రీకాంత్ కెరీర్ మరింత ఉజ్వలంగా సాగాలని, మరిన్ని ఆణిముత్యాల్లాంటి విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు.
సీఎం జగన్ ట్వీట్ కు కిడాంబి శ్రీకాంత్ వినమ్రంగా బదులిచ్చాడు. 'నిరంతరం నాకు మద్దతుగా నిలుస్తున్నందుకు, మీ హృదయపూర్వక అభినందనలకు థాంక్యూ సర్' అంటూ పేర్కొన్నాడు. రాష్ట్రం, దేశం గర్వించేలా మరిన్ని ఘనతర విజయాలు సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అంటూ స్ఫూర్తిని ప్రదర్శించాడు.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల విభాగంలో స్వర్ణం ఇప్పటికీ భారత్ కు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. 1983లో ప్రకాశ్ పదుకొనే, 2019లో సాయిప్రణీత్ కాంస్యాలు సాధించగా, ఇప్పుడు కిడాంబి శ్రీకాంత్ రజతం అందుకున్నాడు. కాగా, వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత్ కు పీవీ సింధు తొలి స్వర్ణం అందించింది. 2019లో సింధు మహిళల విభాగంలో పసిడి సాధించి చరిత్ర సృష్టించింది.