Australia: యాషెస్ రెండో టెస్టు కూడా ఆసీస్ దే... ఇంగ్లండ్ మళ్లీ కుదేలు!
- అడిలైడ్ లో రెండో టెస్టు
- 275 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం
- జై రిచర్డ్సన్ కు 5 వికెట్లు
- 5 టెస్టుల సిరీస్ లో ఆసీస్ 2-0తో ఆధిక్యం
- ఈ నెల 26 నుంచి మూడో టెస్టు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 468 పరుగుల టార్గెట్ ను ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ వోక్స్ అత్యధికంగా 44 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 5 వికెట్లు తీయడం విశేషం. మిచెల్ స్టార్క్ 2, నాథన్ లైయన్ 2 వికెట్లు చేజిక్కించుకున్నారు.
అడిలైడ్ లో జరిగిన ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. అయితే ఏ దశలోనూ ఇంగ్లండ్ లక్ష్యాన్ని సమీపించేలా కనిపించలేదు. కెప్టెన్ జో రూట్ గాయపడడం ఇంగ్లండ్ శిబిరాన్ని నిరాశకు గురిచేసింది.
ఈ విజయం అనంతరం 5 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది.