winter: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

take care of your self during harsh winter

  • చిన్నారులు, వృద్ధులకు ఎక్కువ రిస్క్
  • గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలుంటే రక్షణ చర్యలు తీసుకోవాలి
  • సొంత వైద్యం కాకుండా.. వైద్యుల సూచనలు పాటించాలి

ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ల కనిష్ఠాలకు పడిపోయాయి. పగటి పూటే చలి వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 6-14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కాలంలో ఫ్లూ వైరస్ లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అలాగే ఫ్లూ జ్వరాలు, న్యూమోనియా, ఆస్తమా, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా 60 ఏళ్లకు పైన వయసున్నవారు, చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. పెద్దలకు గుండెపోటు రిస్క్ ఎక్కువగా ఉంటుందని, వీరితోపాటు అవయవ మార్పిడి తరహా చికిత్సలు చేయించుకున్న వారు జాగ్రత్తగా మసలుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా బాధితులూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

ప్రధానంగా వాతావరణంలో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. కనుక మాయిశ్చరైజింగ్, గ్లిజరిన్ వంటి వాటితో ఈ సమస్యను అధిగమించొచ్చు. మధుమేహులకు చర్మంపై పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక పొడి బారకుండా వారు చర్యలు తీసుకోవాలి. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయడం, చల్లటి నీరు, చల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

చలికాలంలో నమోదయ్యే మరణాల్లో గుండె, ఊపిరితిత్తుల బాధితులే ఎక్కువగా ఉంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. కనుక వీరు తమ రోజువారీ ఔషధాలను విడవకుండా తీసుకోవడం, అత్యవసరమైతే తప్పించి ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. అలాగే, వాకింగ్, జాగింగ్ చేసే వారు ఎండ వచ్చిన తర్వాతే ఆ పనిచేయడం శ్రేయస్కరం.

కీళ్ల సంబంధిత సమస్యలు కూడా ఈ కాలంలో తీవ్రతరం అవుతుంటాయి. కనుక అవసరం అనిపిస్తే రూమ్ హీటర్ల సాయంతో గదిలో అతి శీతల వాతావరణం లేకుండా చూసుకోవచ్చు. ప్రధానంగా చల్లటి వాతావరణం వల్ల రక్త నాళాలు కుచించుకుపోవడంతో గుండెపోటు, పక్షవాతం రిస్క్ ఉంటుందన్నది గుర్తు పెట్టుకోవాలి. ఏ సమస్య వచ్చినా సొంత వైద్యం కాకుండా.. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు నడుచుకోవాలి.

  • Loading...

More Telugu News