Ozone Layer: ఓజోన్ పొరకు అంటార్కిటికా ఖండం కంటే పెద్ద రంధ్రం!

Scientists predicts huge hole to Ozone layer will be closed in a week
  • దక్షిణార్థ గోళంలో తెరుచుకుని ఉన్న ఓజోన్ పొర రంధ్రం
  • తాత్కాలికంగా మూసుకుపోతుందంటున్న పరిశోధకులు
  • 2050 నాటికి శాశ్వతంగా మూసుకుపోతుందని అంచనా
  • ఫలిస్తున్న కాలుష్య నివారణ చర్యలు
భగభగమండే అగ్నిగోళం వంటి సూర్యుని శక్తిలో కొద్దిమొత్తం మాత్రమే భూమిని చేరుతుంది. ఆ కొంచెం శక్తికే భూమండలంపై ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. సూర్యరశ్మితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అందులోని అతినీలలోహిత కిరణాలతో అంతకంటే ముప్పు ఉంటుంది. అయితే, సూర్యరశ్మిలోని ప్రమాదకర అల్ట్రావయొలెట్ కిరణాలు నేరుగా భూమిని తాకకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఆ పొరకు ప్రతి ఏడాది భారీ రంధ్రం ఏర్పడుతుంటుంది. ఈ ఏడాది ఏర్పడిన ఆ రంధ్రం అంటార్కిటికా ఖండం కంటే పెద్దది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణార్థ గోళంలో తెరుచుకుని ఉన్న ఈ రంధ్రం 8.8 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉందని వివరించారు. ఈ రంధ్రం కారణంగా అమితమైన ఉష్ణోగ్రత భూమిపైకి ప్రసరిస్తుండడంతో వాతావరణ వైపరీత్యాలు కలుగుతున్నట్టు గుర్తించారు. ఇది పలుమార్లు మూసుకుంటున్నప్పటికీ, కాలుష్య ప్రభావంతో శాశ్వతంగా మూతపడడంలేదు. కాగా, మరో వారంలో ఇది తాత్కాలికంగా మూసుకుపోనుందని పరిశోధకులు అంటున్నారు.

ఈ భారీ రంధ్రం శాశ్వతంగా మూసుకుపోవాలంటే 2050 వరకు ఆగాల్సిందేనట. భూమిపై వాతావరణ కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలు ఫలించి అప్పటిలోగా గాల్లో ప్రమాదకర వాయువుల శాతం తగ్గుతుందని అంచనా. వాస్తవానికి ఓజోన్ ఓ వాయువు. మూడు ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఒక ఓజోన్  అణువు ఏర్పడుతుంది. స్ట్రాటో ఆవరణంలో ఉండే ఈ ఓజోన్ పొర భూమికి 7 నుంచి 25 మైళ్ల ఎత్తులో విస్తరించి ఉంటుంది. ఇది భూమిపై నుంచి వెలువడే రసాయనాల కారణంగా మార్పులకు లోనై క్రమంగా కరిగిపోతోంది.

80వ దశకంలో ఓజోన్ పొర కరిగిపోతోందన్న అంశాన్ని గుర్తించిన ప్రపంచదేశాలు 1987 నుంచి హానికారక వాయువులు, రసాయనాలను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రారంభించాయి. మరో ముప్పయ్యేళ్లకు కాలుష్య నియంత్రణ చర్యలు ఫలించి ఓజోన్ పొరకు ఏర్పడుతున్న రంధ్రం పూర్తిగా మూసుకుపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Ozone Layer
Huge Hole
Antarctica
Sun
Pollution

More Telugu News