Hyderabad metro: భారీ నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో తంటాలు.. రూ.13,600 కోట్ల సమీకరణకు చర్యలు

Hyderabad metro to raise funds to cut funding cost

  • 2020-21లో రూ.1,767 కోట్ల నష్టాలు
  • సాయం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లోగడ విన్నపం
  • రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునే ప్రయత్నాలు
  • ఎన్ సీడీలు, కమర్షియల్ పేపర్ల జారీకి సిద్ధం
  • 2శాతం వరకు తగ్గనున్న వడ్డీభారం

భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గిస్తూ, కాలుష్యం లేని, వేగవంతమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రోరైల్ ఇప్పుడు నష్టాల నుంచి బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తోంది. వడ్డీ లేని ఆర్థిక సాయం కోసం గతంలో తెలంగాణ సర్కారును అభ్యర్థించినా ఎటువంటి ఊరట లభించలేదు. దీంతో ఇతర ప్రత్యామ్నాయాల దిశగా చర్యలు మొదలు పెట్టింది. ముఖ్యంగా ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించింది.

బాండ్లు, కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా రూ.13,600 కోట్లను సమీకరించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్ సీడీలు) జారీ చేసి రూ.8,600 కోట్లు, కమర్షియల్ పేపర్ల రూపంలో మరో రూ.5,000 కోట్లను సమకూర్చుకోనుంది. ఇందుకు సంబంధించి ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్ సాయం తీసుకుంటోంది.  ఇలా సేకరించిన నిధులతో ప్రస్తుత రుణాలను తీర్చేయనుంది. దీనివల్ల రెండు శాతం వరకు వడ్డీ భారం ఆదా కానుంది.

కరోనా రాకముందు వరకు మెట్రోరైలులో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ, కరోనా తర్వాత పరిస్థితి మరింత ప్రతికూలంగా మారింది. ఈ సంస్థ మొదటి రెండు కారిడార్లను 2017 నవంబర్ నాటికి ప్రారంభించగా, 2020 ఫిబ్రవరి నాటికి మూడో కారిడార్ ను కూడా వినియోగానికి తీసుకొచ్చింది.

మెట్రో నిర్వహణపై ఎల్ అండ్ టీకి 35 ఏళ్లపాటు హక్కులు ఉన్నాయి. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2021 మార్చితో ముగిసిన సంవత్సరంలో రూ.1,767 కోట్లకు పెరిగిపోయాయి. భారీ నష్టాలతో నడపడం తమ వల్ల కాదంటూ, అవసరమైతే తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకూ ఎల్అండ్ టీ ఒకదశలో సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆర్థిక సాయానికి తెలంగాణ సర్కారు ముందుకు వచ్చింది కానీ, ఇంతవరకు దక్కిన ఊరట ఏదీలేదు.

  • Loading...

More Telugu News