Atchannaidu: అశోక్ గజపతి రాజును ఇంతగా అవమానిస్తారా?: అచ్చెన్న ఆగ్రహం
- ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరించారు
- జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది నిరద్శనం
- ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు
- 400 ఏళ్ల చరిత్ర గల ఆలయ ధర్మకర్తను అవమానిస్తారా? అంటూ నిలదీత
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో అధికారులు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై ప్రవర్తించిన తీరు సరికాదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రొటోకాల్ పాటించకుండా వైసీపీ నేతలు, అధికారులు ఆలయం వద్ద ఇష్టానుసారంగా వ్యవహరించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అశోక్ గజపతి రాజును వైసీపీ కార్యకర్తలు తోసేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఆలయ ధర్మకర్తల మండలితో శంకుస్థాపన గురించి చర్చించకపోవడం సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం దురదృష్టకరమని అన్నారు. రామతీర్థంలో అశోక్ గజపతి రాజును ఇంతలా అవమానించడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీలో దాదాపు 200 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.