AP High Court: జీవోలను ఎందుకు దాస్తున్నారు? వెబ్ సైట్లో ఎందుకు పెట్టడం లేదు?: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

AP High Court asks AP govt why not putting GOs in website
  • జీవోలను వెబ్ సైట్లో పెట్టడాన్ని ఆపేసిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
  • సాఫీగా సాగిపోతున్న ప్రక్రియకు ఎందుకు ఆటంకం కలిగించారన్న హైకోర్టు
ప్రతి జీవోను ఏపీ ప్రభుత్వం వెబ్ సైట్లలో పెట్టడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున లాయర్ ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో కేవలం ఐదు శాతం జీవోలను మాత్రమే వెబ్ సైట్లో పెడుతున్నారని కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. సాఫీగా సాగిపోతున్న ప్రక్రియకు ఎందుకు ఆటంకం కలిగించారని ప్రశ్నించింది. జీవోఐఆర్టీ వెబ్ సైట్లో జీవోలు ఎందుకు పెట్టడం లేదని, ఎందుకు దాస్తున్నారని అడిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ వాదిస్తూ, టాప్ సీక్రెట్ జీవోలను వెబ్ సైట్లో పెట్టడం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో జీవోలను సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్ని జీవోలను విడుదల చేసింది? ఎన్ని జీవోలను వెబ్ సైట్లో ఉంచింది? ఎన్ని జీవోలను టాప్ సీక్రెట్ అంటూ అప్ లోడ్ చేయలేదు? అనే వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
AP High Court
Andhra Pradesh
Government
GOs
Website

More Telugu News