africans: ప్రాణం కాపాడుకునేందుకు వస్తూ.. ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న విదేశీయులు

africans affected with omicrom while coming to hyderabad

  • విమాన ప్రయాణంలో సోకుతున్న కరోనా ఒమిక్రాన్
  • గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది వారే
  • కేన్సర్ తదితర సమస్యలున్న వారి పరిస్థితి ఆందోళనకరం

ప్రాణాంతక వ్యాధి.. మెరుగైన చికిత్స తీసుకుంటేనే బతికే అవకాశం. అందుకోసం ఆర్థిక పరిస్థితులను, దూరాభారాన్ని లెక్కచేయకుండా భారత్ కోసం వచ్చే విదేశీయులు ఏటా లక్షల్లో ఉంటున్నారు. అందులోనూ హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి మెరుగైన వైద్య చికిత్సల కోసం ఎక్కువ మంది వస్తుంటారు. కానీ, కరోనా కాలంలో మెరుగైన వైద్యం కోసమని వీరు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టు పరిస్థితులను గమనిస్తే తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఒమిక్రాన్ కేసులు.

హైదరాబాద్ లోని టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న కరోనా ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. వీరిలో ప్రాణాంతక కేన్సర్ తో బాధపడుతున్న వారు సైతం ఉన్నారు. సోమాలియా నుంచి హైదరాబాద్ కు మెరుగైన వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తి కేన్సర్ బాధితుడని పరీక్షల్లో తేలింది. ప్రైవేటు ఆసుపత్రి నుంచి సదరు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కెన్యాకు చెందిన బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. వీరిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. స్వదేశం నుంచి భారత్ కు విమానాల్లో వచ్చే సమయంలో వీరంతా కరోనా బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడదామన్న సంకల్పంతో వస్తూ.. కరోనాకు బలైపోతే వారి కుటుంబాలకు తీవ్ర శోకమే మిగలనుంది.

హైదరాబాద్ లో ప్రఖ్యాతిగాంచిన ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి. పైగా చికిత్స వ్యయాలు అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడి ఆసుపత్రులను ఎంపిక చేసుకుంటున్నారు. కేన్సర్ బాధితులు ఎక్కువగా వస్తుంటారు. రోజుల నుంచి నెలల పాటు ఇక్కడే ఉండి, పూర్తి చికిత్స తర్వాత కోలుకుని స్వదేశాలకు వెళుతున్నవారే ఎక్కువ. ఆఫ్రికా దేశాలు, ఆసియా, గల్ఫ్ దేశాలు, ఉజ్బెకిస్థాన్ నుంచి ఎక్కువ మంది ఇటు వస్తుంటారు. కానీ, కరోనా వల్ల ఇప్పుడు వీరికి రిస్క్ పెరిగింది.

  • Loading...

More Telugu News