AstraZeneca: మూడో డోసుతో భారీగా పెరుగుతున్న కోవిడ్ యాంటీబాడీలు: ఆస్ట్రాజెనెకా
- కరోనా వేరియంట్ ను న్యూట్రలైజ్ చేస్తోంది
- ఆక్స్ ఫర్డ్ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడైనట్టు ప్రకటన
- టీకాల సామర్థ్యం తగ్గలేదు
- కేరళ ఐఎంఏ పరిశోధన విభాగం చైర్మన్
బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మూడో డోసు లేదా బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యాంటీబాడీలు తయారవుతున్నట్టు తెలిపింది. ఆక్స్ ఫర్డ్ ల్యాబొరేటరీ అధ్యయనంలో ఈ విషయం గుర్తించినట్టు ప్రకటించింది.
మన దేశంలో ఎక్కువ మందికి ఇచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆస్ట్రాజెనెకా కంపెనీయే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో అభివృద్ధి చేయడం గమనార్హం. ఈ టీకాను సిరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసి మన దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. డెల్టా వేరియంట్ లో మాదిరిగానే.. టీకా మూడో డోసు ఒమిక్రాన్ వేరియంట్ ను తటస్ఠీకరణ చేస్తోందని ఆస్ట్రాజెనెకా తెలిపింది. అంటే ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారు మూడో డోసుకు సిద్ధం కావాలన్న సూచన ఇందులో కనిపిస్తోంది.
మరోవైపు ఈ టీకాల ప్రభావానికి మద్దతుగా కేరళ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీసెర్చ్ విభాగం వైస్ చైర్మన్ రాజీవ్ జయదేవన్ చేసిన ప్రకటన ఊరటనిచ్చేదిలా ఉంది. ‘‘నేటి వరకు మన దేశంలో ఇస్తున్న రెండు టీకాలకు (కోవిషీల్డ్, కోవాక్సిన్) సంబంధించి రక్షణ క్షీణిస్తున్నట్టు ఎటువంటి దాఖలాలు లేవు. ఈ టీకాలు తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవుతున్న సంకేతాలు కూడా కనిపించలేదు’’అంటూ జయదేవన్ ప్రకటన చేశారు.