Bomb Blast: లూథియానా కోర్టు సముదాయంలో బాంబు పేలుడు... ఇద్దరి మృతి

Two dead in a bomb explosion in Ludhiana court complex

  • కోర్టు రెండో ఫ్లోర్ లో ఘటన
  • బాత్రూంలో పేలుడు
  • నలుగురికి తీవ్ర గాయాలు
  • లూథియానా బయల్దేరిన పంజాబ్ సీఎం

పంజాబ్ లోని లూథియానాలో ఓ న్యాయస్థానం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. కోర్టు సముదాయంలోని రెండో ఫ్లోర్ లో ఉన్న ఓ బాత్రూంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాత్రూం గోడలు కుప్పకూలిపోగా, సమీపంలోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తీవ్రంగా స్పందించారు. తాను లూథియానా వెళుతున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జాతి విద్రోహ శక్తులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, పేలుళ్లకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఘటన జరిగిన వెంటనే లూథియానా పోలీస్ కమిషనర్ గుర్ ప్రీత్ భుల్లార్ స్పందించారు. లూథియానా కోర్టు కాంప్లెక్స్ లోని రెండో ఫ్లోర్ లో రికార్డు రూమ్ కు సమీపంలో పేలుడు జరిగిందని, చండీగఢ్ నుంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడికి తరలించామని వెల్లడించారు. భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని, దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీస్తామని అన్నారు.

పేలుడు ఘటనపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. లూథియానా కోర్టులో విస్ఫోటనం జరిగి ఇద్దరు బలైన ఘటన కలవరపాటుకు గురిచేస్తోందని అన్నారు. ఈ పేలుడు కారకులెవ్వరో తేల్చాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News