Shobhu Yarlagadda: బొత్స వ్యాఖ్యలకు టాలీవుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్
- ఇటీవల సినిమా టికెట్ల ధరలు తగ్గించిన సర్కారు
- ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందన్న బొత్స
- ఎమ్మార్పీని మించి అమ్మలేం కదా అంటూ వ్యాఖ్యలు
- స్పందించిన శోభు యార్లగడ్డ
ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని, ఆ పరిమితికి మించి ఎక్కడా విక్రయించరని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సినిమా టికెట్ల ధరలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇష్టానుసారం టికెట్ల రేట్లు పెంచడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.
మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతేతప్ప, ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురక అంటించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను ఇటీవల ప్రభుత్వం నిర్ణయించడాన్ని దృష్టిలో ఉంచుకుని శోభు యార్లగడ్డ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.
సినిమా టికెట్ల వ్యవహారం నేపథ్యంలో ఏపీలో 50 థియేటర్లు మూతపడ్డాయని ఆయన అన్నారు. దీని ప్రభావం రాబోయే చిత్రాల విడుదలపైనే కాకుండా, దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ వ్యవస్థపైనా, తెలుగు సినీ పరిశ్రమపైనా తీవ్రస్థాయిలో ఉంటుందని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఇవాళ నాని చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు.
సినిమా టికెట్ల ధరల విషయంలో కొంతకాలంగా అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వం దీనిపై జీవో కూడా జారీ చేయగా, కొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్ దారులకు మాత్రం వెసులుబాటు కల్పించింది. అయితే, టికెట్ల అంశంపై టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారని ఈ ఉదయం నాని చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.