Dr. RAMINENI FOUNDATION: ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడొచ్చింది.. నేను 20 ఏళ్ల క్రితమే నమ్మా: డాక్టర్ కృష్ణ ఎల్ల
- డాక్టర్ రామినేని ఫౌండేషన్ నుంచి విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన డాక్టర్ కృష్ణ ఎల్ల
- సుప్రీం సీజే జస్టిస్ ఎన్వీ రమణపై సుచిత్ర ఎల్ల ప్రశంసలు
- పక్కవారి కష్టం, సమన్యాయం తెలిసిన వ్యక్తి అంటూ సీజేను కొనియాడిన నటుడు బ్రహ్మానందం
ఆత్మనిర్భర్ భారత్‌ను తాను 20 ఏళ్ల క్రితమే నమ్మినట్టు భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిన్న జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన డాక్టర్ కృష్ణ ఎల్ల అనంతరం మాట్లాడుతూ.. టీకాల తయారీలో ప్రపంచానికే మన దేశం నాయకత్వం వహిస్తుండడం మనకు గర్వకారణమన్నారు.
ఎంచుకున్న దారిలో ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా ముందుకు సాగాలని, అప్పుడే లక్ష్యాలు సాక్షాత్కరిస్తాయని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడొచ్చిందని, ఇలాంటి రోజు వస్తుందని తాను రెండు దశాబ్దాల క్రితమే విశ్వసించినట్టు చెప్పారు.
భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ప్రశంసలు కురిపించారు. పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు విషయంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి నుంచి తాను ఎంతో నేర్చుకుంటున్నట్టు చెప్పారు. టీకా తయారీ ఘనత తమ ఒక్కరిదే కాదని, భారత్ బయోటెక్‌లో పనిచేసే మొత్తం రెండు వేల మంది ఉద్యోగులదని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ పక్కవారి కష్టం, సమన్యాయం తెలిసిన వ్యక్తి అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు.