Telangana: కరోనా వ్యాక్సినేషన్ లో తెలంగాణ ఘనత!
- తెలంగాణలో 100 శాతం తొలి డోసు పూర్తి
- రెండో డోసు పూర్తి చేసుకున్న 61 శాతం మంది
- వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారన్న వైద్యారోగ్యశాఖ
ప్రపంచాన్ని గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి కేవలం వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకాఉత్సవ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో 130 కోట్లకు పైగా టీకా డోసులను వేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఓ ఘనతను సాధించింది. రాష్ట్రంలో 100 శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 61 శాతం మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తయిందని తెలిపారు.
వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ప్రతి ఒక్క వైద్య సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని... వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు.