Tollywood: ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ కన్నుమూత
- 90 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా చెన్నైలో మృతి
- టాలీవుడ్‌లో 1995లో స్త్రీ అనే సినిమాకు దర్శకత్వం
- దక్షిణాదిన మొత్తం 60కిపైగా సినిమాలు చేసిన మాధవన్
ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ (90) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన వార్ధక్యపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స తీసుకుంటూ చెన్నైలోని నివాసంలో ఆయన కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1995లో ఎన్ఎఫ్డీసీ నిర్మించిన 'స్త్రీ' అనే తెలుగు సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. కేరళలోని పాలక్కడ్‌లో 1931లో సేతు మాధవన్ జన్మించారు. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, సంతోష్ సేతు మాధవన్, ఉమ ఉన్నారు.
1961లో మలయాళ సినిమాతో దర్శకుడిగా ఆయన సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తమిళ, కన్నడ, హిందీ భాషలతో కలిపి ఆయన మొత్తం 60కిపైగా సినిమాలను రూపొందించారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆయనకు అవార్డు దక్కింది.