Harish Rao: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం: హరీశ్ రావు
- ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తీవ్రత మాత్రం తక్కువే
- థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- 24 లక్షల హోమ్ ఐసొలేషన్ కిట్లను రెడీగా ఉంచాం
ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తోంది. హైదరాబాదులో ఇప్పటికే 30కి పైగా బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ బస్తీ దవాఖానాలను మున్సిపాలిటీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోందని హరీశ్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని తీవ్రత మాత్రం తక్కువేనని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే హైదరాబాదులో 1,400 పడకలను ఏర్పాటు చేశామని... నీలోఫర్ ఆసుపత్రిలో 800 పడకలు, మరో 6 ఆసుపత్రుల్లో 100 బెడ్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 24 లక్షల హోమ్ ఐసొలేషన్ కిట్లను రెడీగా ఉంచామని అన్నారు.
పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందించేలా కేసీఆర్ ఆదేశాలను జారీ చేశారని హరీశ్ చెప్పారు. పేదల వైద్యం కోసం ఎక్కువ నిధులను ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే కితాబునిచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారు. కోవిడ్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మరోపక్క, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని హరీశ్ అన్నారు. బూస్టర్ డోస్ తో పాటు చిన్నపిల్లల వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమికూడకుండా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్పందిస్తూ... హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.