Anil Kumar Yadav: హీరో నాని ఎవరో నాకు తెలియదు.. పవన్ ఈ పని చేస్తే టికెట్ల ధరలు తగ్గుతాయి: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- సినిమాల్లో పవన్ కల్యాణ్ పారితోషికం ఎంత?
- పవన్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకోవాలి
- నాకు కొడాలి నాని మత్రమే తెలుసు
- అభిమానులు తమ డబ్బును అనవసరంగా ఖర్చుచేయకూడదు
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సినీ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. ఈ రోజు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. నానితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.
'సినిమాల్లో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? పవన్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్ ధరలతో నష్టమే ఉండదు. సినీ హీరోలు పారితోషికం తగ్గించుకుంటే.. టికెట్ల ధరలు మరింత తగ్గుతాయి' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు అయిన ఖర్చు ఎంత అని అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు. వాటిలో పవన్ కల్యాణ్ తీసుకున్న పారితోషికం ఎంత? అని ప్రశ్నించారు. సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళుతోందని ఆయన అన్నారు. ఆ నలుగురు తీసుకునే కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుతూ అనుమతులు ఇవ్వాలా? అని ఆయన నిలదీశారు.
సినీ అభిమానులు తమ డబ్బులు సినిమాలకు ఖర్చుపెడుతూ నష్టపోవద్దని ఆయన సూచించారు. గతంలో చారిత్రక, సందేశాత్మక సినిమాలకు రేట్లు పెంచుకునేవారని ఆయన అన్నారు. ఇప్పుడు మాత్రం అన్ని సినిమాలకూ రేట్లు పెంచడం ఏంటని ఆయన నిలదీశారు.
అసలు తనకు ఈ హీరో నాని ఎవరో తెలియదని, తనకు మంత్రి కొడాలి నాని మాత్రమే తెలుసని అనిల్ కుమార్ అన్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును కొందరు యువకులు క్రేజ్ కోసం సినిమాలకు ఖర్చు పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ మోజులో తాను కూడా గతంలో డబ్బులు ఖర్చుచేశానని చెప్పారు.
కాగా, సామాజిక మాధ్యమాల్లో ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. కొందరు ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే, మరి కొందరు హీరో నానిని సమర్థిస్తూ పోస్టులు చేస్తున్నారు.