Karnataka: ఇరుపక్షాలదీ తప్పే... క్రైస్తవులపై జరిగిన దాడులపై కర్ణాటక హోంమంత్రి స్పందన
- క్రైస్తవుల ప్రేయర్ మీటింగులపై దాడులు
- మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ దాడులు
- తప్పు రెండు వైపులా ఉందన్న హోంమంత్రి
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఆందోళనల మధ్యే క్రిస్మస్ కు రెండు రోజుల ముందు ఈ బిల్లును ఆమోదించారు. మరోవైపు కర్ణాటకలో క్రైస్తవులపై దాడులు జరిగాయి. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ వారి ప్రేయర్ మీటింగులపై కొందరు దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలపై కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర మాట్లాడుతూ, తప్పు ఇరుపక్షాల వైపు ఉందని అన్నారు. ఒకవేళ వారు బలవంతపు మతమార్పిడులకు పాల్పడకపోతే మౌనంగా ఉండొచ్చని, రచ్చ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏ ఒక్కరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని... జరిగిన దానిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్న విషయం నిజమేనని అన్నారు.