CJI NV Ramana: స్వగ్రామంలో సీజేఐ ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం
- సీజేఐ అయిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి రాక
- పూర్ణకుంభ స్వాగతం పలికిన వేదపండితులు
- ఎడ్లబండిపై ఊరేగింపు
- జస్టిస్ రమణపై పూలవర్షం కురిపించిన గ్రామస్థులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి స్వగ్రామానికి విచ్చేశారు. సీజేఐ ఎన్వీ రమణ స్వస్థలం కృష్ణా జిల్లా పొన్నవరం. జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. వేదపండితులు మంత్రోచ్చారణతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. గ్రామస్థులు ఆయనకు శాలువాలు కప్పి, గజమాలతో సన్మానించారు. ఆయనకు పలు రకాల కానుకలు అందించారు. ఆయనకు వెండినాగలి కూడా బహూకరించారు. అనంతరం సంప్రదాయ ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. గ్రామస్తులు ఆయనను సత్కరించారు. ఆయనకు పలు రకాల కానుకలు అందించారు. ఆయనకు వెండినాగలి కూడా బహూకరించారు.
అంతకుముందు, జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు వద్ద ఘనస్వాగతం లభించింది. రోడ్డుకు ఓవైపుగా త్రివర్ణ పతాకాలు చేతబూనిన విద్యార్థినులు నిల్చుని ఆయనకు నీరాజనాలు పట్టారు. జస్టిస్ ఎన్వీ రమణ తన వాహనంలోంచి పైకి లేచి నిల్చుని వినమ్రంగా అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు.
ఇక సొంత ఊరు పొన్నవరం చేరుకున్న తర్వాత లభించిన ప్రజాదరణ చూసి ఎన్వీ రమణ పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. పొన్నవరం గ్రామంతో తన అనుబంధం చెరగనిదని పేర్కొన్నారు. పొన్నవరం రోడ్లు, పొలాలు, చెరువులు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. చాన్నాళ్ల తర్వాత మాతృభూమి మట్టివాసన ఆస్వాదిస్తున్నానని భావోద్వేగాలకు గురయ్యారు.
1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం మా పొన్నవరం గ్రామం అని పేర్కొన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని వెల్లడించారు. తాను ఈ స్థాయికి ఎదగడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. మీ అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నానని వినమ్రంగా తెలిపారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదని, పొన్నవరం గ్రామ ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చానని పేర్కొన్నారు.
సమస్య ఎలాంటిదైనా ప్రజల ఐకమత్యమే మందు అని పేర్కొన్నారు. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం నడుచుకోవాలని సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి ఢిల్లీలో అనేకమంది చెబుతారని, తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తెలుగువారే నిర్మించారని చెబుతారని సీజేఐ వెల్లడించారు.