Ravi Shastri: అశ్విన్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి ఏమన్నాడంటే...!
- కుల్దీప్ విదేశాల్లో నెంబర్ వన్ బౌలర్ అన్న రవిశాస్త్రి
- తీవ్ర వేదనకు గురయ్యానన్న అశ్విన్
- ఆ వ్యాఖ్యలతో మంచే జరిగిందన్న రవిశాస్త్రి
- తర్వాత కాలంలో అశ్విన్ బాగా రాణించాడని కితాబు
ఇటీవల టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ కోచ్ రవిశాస్త్రిపై వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో తన ఎదురుగానే మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను పొగడడం బాధించిందని తెలిపాడు. విదేశాల్లో కుల్దీప్ యాదవే భారత నెంబర్ వన్ బౌలర్ అని రవిశాస్త్రి పేర్కొనడం తనను వేదనకు గురిచేసిందని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, అశ్విన్ వ్యాఖ్యలకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
ప్రతి ఒక్కరినీ పొగడ్తలతో ఆకాశానికెత్తడం ఓ కోచ్ గా తన పని కాదని స్పష్టం చేశారు. ఎలాంటి దురుద్దేశాలు లేకుండా వాస్తవాలు మాట్లాడడం తన విధి అని పేర్కొన్నారు. అశ్విన్ ఆ తర్వాత కాలంలో విశేషంగా రాణించడానికి తన వ్యాఖ్యలే కారణం అయ్యుంటే అందుకు ఎంతో సంతోషిస్తానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేకాదు తాను ఎలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ ను ప్రశంసించాడో కూడా వివరించాడు.
"నాడు సిడ్నీలో జరిగిన ఆ టెస్టులో అశ్విన్ ఆడలేదు. ఆ మ్యాచ్ లో కుల్దీప్ ను బరిలో దించాం. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు సాధించాడు. అప్పటికి తన కెరీర్ లో మొదటిదో, రెండవదో టెస్టు ఆడుతున్న కుల్దీప్ వంటి యువ ఆటగాడ్ని పొగడడంలో తప్పేమీలేదనుకుంటున్నా. ఎందుకంటే మరే స్పిన్నర్ రాణించనంతగా ఆ టెస్టులో కుల్దీప్ యాదవ్ అమోఘంగా బౌలింగ్ చేశాడు. దాంతో, తనకు లభించిన ప్రతి అవకాశాన్ని కుల్దీప్ ఇదే విధంగా సద్వినియోగం చేసుకుంటే విదేశాల్లో నెంబర్ వన్ బౌలర్ అవుతాడు అన్నాను.
ఒకవేళ నేనన్న ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అది మంచిదే అంటాను. నేను అనడం,అశ్విన్ బాధపడడం వల్ల మంచే జరిగిందంటాను. ఎందుకంటే అశ్విన్ ఆ తర్వాత కాలంలో చాలా బాగా రాణించాడు. తప్పనిసరిగా రాణించి నేనేంటో ఈ కోచ్ కు చూపించాలని ప్రతి ఆటగాడు తన అంతరంగంలో భావించేలా చేయడం నా స్టయిల్.
నా వ్యాఖ్యలు ఓ ఆటగాడిని బాధించినా, ఆ వ్యాఖ్యలతో అతడి నుంచి మెరుగైన ప్రదర్శన వస్తే ఎంతో సంతోషిస్తాను. అతడిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీశానన్న సంతృప్తి నాకు ఉంటుంది. అశ్విన్ విషయానికొస్తే 2019లోనూ, 2021లో ఆసీస్ గడ్డపై రాణించిన తీరు పట్ల ఇదే భావన వ్యక్తం చేస్తాను" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.