V Prashanth Reddy: ధాన్యం కొనుగోలుపై కేంద్రం లేఖ ఇవ్వాల్సిందే... లేకపోతే..!: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి
- తీవ్రరూపు దాల్చుతున్న ధాన్యం కొనుగోలు అంశం
- గత వారం రోజులుగా ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీల మకాం
- కేంద్రం స్పందించడంలేదన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
- ధాన్యం ఇండియా గేటు వద్ద పారబోస్తామని వెల్లడి
ధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, ధాన్యం కొనుగోలుపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయే 60 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశామని, స్పందించేందుకు రెండ్రోజుల సమయం కోరిన ఆయన ఇప్పటివరకు ఏ విషయం చెప్పలేదని ఆరోపించారు.
వానాకాలంలో ఎంతపండితే అంత ధాన్యం కొంటామని పియూష్ గోయల్ పార్లమెంటు సాక్షిగా మాటిచ్చారని, ఇప్పుడు దానిపై తాము లిఖితపూర్వక హామీ కోరుతున్నామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. లిఖితపూర్వక హామీతో కూడిన లేఖ కేంద్రం నుంచి రాకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద పారబోస్తామని తేల్చిచెప్పారు. ధాన్యం కొనుగోలుపై గత వారం రోజులుగా మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీలో ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.