Sai Kumar: ఆ విషయంలో నేను కొందరు స్టార్స్ ను హర్ట్ చేశాను: సాయికుమార్
- డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పొజిషన్ చూశాను
- అందుకున్న తొలి పారితోషికం 500 రూపాయలు
- 25 వేల వరకూ తీసుకున్నాను
- ఇప్పుడు లక్షల్లోకి వెళ్లిపోయింది
సాయికుమార్ హీరోగా మారడానికి ముందు ఆయన చాలామంది హీరోలకు డబ్బింగ్ చెప్పేవారు. రజనీకాంత్ .. రాజశేఖర్ .. సుమన్ వంటి వారికి ఆయన వాయిస్ బాగా సెట్ అయ్యేది. అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్టులలో ఆయనకి తిరుగులేని ఇమేజ్ ఉండేది. అయితే, హీరో అయిన తరువాత ఆయన ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పడం మానేశారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ .. 'పోలీస్ స్టోరీ' తరువాత కొంతమంది పెద్ద వాళ్లంతా కలిసి 'నీకు ఉన్నదే నీ వాయిస్ .. నువ్వు హీరో అయిన తరువాత ఆ వాయిస్ ను అందరికీ ఇస్తే మొనాటినీ అయిపోతుంది .. అలా చేయకు' అని చెప్పారు. అది తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే సుమన్ .. రాజశేఖర్ వంటి వారిని నేను ఈ విషయంలో హర్ట్ చేశాను.
తెలియకుండా రజనీకాంత్ లాంటివారిని కూడా హర్ట్ చేశాను. రజనీకాంత్ కి 'బాషా'తో పాటు చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. వాళ్లంతా సూపర్ స్టార్స్ .. సాయికుమార్ డబ్బింగ్ చెప్పనన్నాడు అంటే వాళ్లకి కూడా ఏదోలా అనిపిస్తుంది గదా? డబ్బింగ్ ఆర్టిస్టుగా 500 నుంచి మొదలుపెట్టి 25 వేల వరకూ తీసుకున్నాను. కానీ ఇప్పుడు డబ్బింగ్ అనేది లక్షల్లోకి వెళ్లిపోయింది" అని చెప్పుకొచ్చారు.