Xiaomi: ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు

Xiaomi may drive in with its first car in 2024

  • ధ్రువీకరించిన సంస్థ సీఈవో లీజున్
  • 10,000 మంది ఇంజనీర్లు పని చేస్తున్నట్టు ప్రకటన
  • స్మార్ట్ ఫోన్ల వ్యాపారం తమకు ప్రధానమని స్పష్టీకరణ
  • 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ప్రణాళిక

తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన షావోమీ ఆ తర్వాత పలు ఇతర ఉత్పత్తుల్లోకీ చొరబడింది. వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు టీవీలు, ల్యాప్ టాప్ లు, ఆడియో ఉత్పత్తులు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, లైట్లు ఇలా ఎన్నింటినో తీసుకొచ్చింది. మన దగ్గర ఇంకా విడుదల చేయలేదు కానీ, చైనాలో వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లను కూడా ప్రవేశపెట్టింది.

ఇక కార్ల మార్కెట్లోనూ పాగా వేసుకునే దిశగా షావోమీ అడుగులు వేస్తోంది. ఈ దిశగా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను సంస్థ సీఈవో లీజున్ ధ్రువీకరించారు. గిజ్మో చైనా నివేదిక ప్రకారం.. లీజున్ వీబో అనే సామాజిక మాధ్యంపై ప్రశ్న, జవాబుల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా.. షావోమీ తన మొదటి కారును 2024లో విడుదల చేస్తుందని ప్రకటించారు. ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు షావోమీ ఈ ఏడాది మొదట్లో ఒక ప్రకటన చేసింది. కానీ, ఎప్పుడు తీసుకురానున్నదీ స్పష్టం చేయలేదు. తాజాగా సంస్థ సీఈవో ఈ విషయాన్ని బయటపెట్టారు.

10,000 మందికి పైగా నిపుణులు, ఇంజనీర్లు కార్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు లీజున్ తెలిపారు. అయినా స్మార్ట్ ఫోన్లు తమ ప్రధాన వ్యాపారంగా ఇక మీదటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్ల ప్రాజెక్టుపై షావోమీ 10 బిలియన్ డాలర్లను (రూ.75,000 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. వార్షికంగా 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలన్నది సంస్థ ప్రణాళిక. మిగిలిన ఉత్పత్తుల మాదిరే ఈ కార్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయో, లేదో చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News