cv anand: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల్లో నిబంధనలు తప్పవు: సీపీగా బాధ్యతలు స్వీకరించాక సీవీ ఆనంద్
- ఈ కమిషనరేట్‌లో ఎన్నో ఏళ్లు పని చేశా
- హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది
- ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే హైకోర్టు సూచనలు
- ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తుది నిర్ణయం
తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బదిలీ కావడంతో ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించి మీడియా సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కమిషనరేట్‌లో ఎన్నో ఏళ్లు పని చేశానని వివరించారు. హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోందని ఆయన గుర్తు చేశారు. మన దగ్గర అంతగా ఒమిక్రాన్ లేదని అన్నారు. దాని వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే హైకోర్టు సూచనలు చేసిందని, నూతన సంవత్సర వేడుకల్లో కొన్ని నిబంధనలు తప్పవని తెలిపారు.
మాస్కులు, సామాజిక దూరం వంటి నిబంధనలు ఉంటాయని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. నగరంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు.
ఎక్కడైతే చదువుకుని, పెరిగానో అక్కడే సీపీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు. హైదరాబాద్ సీపీగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. తాను ఇప్పుడే చార్జ్ తీసుకున్నానని, పలు అంశాలను పరిశీలించడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత మరోసారి మీడియా సమావేశం నిర్వహించి మరిన్ని అంశాలపై మాట్లాడతానని అన్నారు.