Narendra Modi: జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల లోపు వారికి టీకా: ప్రధాని కీలక ప్రకటన

Precaution Doses For Elderly From January 10 said Modi

  • గత రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ
  • ఒమిక్రాన్ వల్ల భయం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని సూచన
  • 60 ఏళ్లు దాటిన వారికి, ఆరోగ్య సిబ్బందికి జనవరి 10 నుంచి టీకాలు
  • మూడో డోసును ‘ప్రికాషన్’ డోసుగా పేర్కొన్న మోదీ

గత రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి మూడో తేదీ నుంచి 15-18 ఏళ్ల లోపు వయసు వారికి కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారంటూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన వెంటనే జనం అప్రమత్తమయ్యారు. ఏదో కీలక ప్రకటన రాబోతోందని భావించారు. అనుకున్నట్టుగానే చిన్నారులకు టీకా పంపిణీపై మోదీ ప్రకటన చేశారు.

ఒమిక్రాన్ వల్ల భయం లేకపోయినా అప్రమత్తత అవసరమన్న మోదీ.. 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ‘ప్రికాషన్ డోసు’ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకాలు వేస్తామన్నారు. కాగా, మూడో డోసును అందరూ బూస్టర్‌ డోసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో మోదీ మాత్రం దానిని ‘ప్రికాషన్’ డోసుగా పేర్కొనడం గమనార్హం. కరోనాపై పోరాటంలో మన అనుభవాలే గొప్ప ఆయుధాలని మోదీ పేర్కొన్నారు. కాబట్టి అనవసర అపోహలు వద్దని, పండగల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ముక్కు ద్వారా తీసుకునే చుక్కల టీకా త్వరలోనే దేశంలో అందుబాటులోకి వస్తుందని మోదీ తెలిపారు.

ఈ ఏడాది జనవరి 16న టీకాల పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్టు మోదీ చెప్పారు. జనాభాలో 61శాతం మందికి టీకాలు అందినట్టు వివరించారు. అలాగే 90 శాతానికి పైగా ఒక డోసు అందిందన్నారు. ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా పాఠశాలల్లో బోధన సాధరణ స్థితికి వస్తుందని అన్నారు.

కరోనా మహమ్మారిపై పోరులో ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. వారు తమ సమయాన్ని కరోనా బాధితుల సేవకే వినియోగిస్తున్నారని కొనియాడారు. వారికి మరో డోసు టీకా ఇవ్వడం ద్వారా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దేశంలో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్స్ ఉన్నట్టు తెలిపారు. చిన్నారుల కోసం ఐసీయూతో కలిసి 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సహకరంగానే ఉన్నాయన్న మోదీ.. వదంతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అప్రమత్తంగా ఉండడం వల్లే  జీవనాన్ని తిరిగి సాధారణస్థాయికి తీసుకురాగలిగామని ప్రధాని వివరించారు.

  • Loading...

More Telugu News