Myanmar: మయన్మార్‌లో సైన్యం మారణహోమం.. 30 మందికిపైగా కాల్చివేత.. బాధితుల్లో మహిళలు, చిన్నారులు

 Over 30 Including Children and Killed In Myanmar
  • 11 నెలల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం
  • నిరసనకారులపై ఉక్కుపాదం
  • సాయుధ ప్రతిఘటన దళాలతో భీకర పోరు
  • శరణార్థి శిబిరాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చి కాల్పులు
  • ఆపై మృతదేహాలను ట్రక్కుల్లో పడేసి తగలబెట్టేసిన వైనం
  • మరోలా చెబుతున్న మయన్మార్ సైన్యం
మయన్మార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. మిలటరీ పాలనపై నిరసన తెలుపుతున్న ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం తాజాగా మరో అకృత్యానికి పాల్పడింది. కయా రాష్ట్రంలోని హెచ్‌ప్రుసో పట్టణం, మో సో గ్రామ సమీపంలో శరణార్థి శిబిరాలకు వెళ్తున్న మహిళలు, చిన్నారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. అనంతరం వారి మృతదేహాలను కాల్చి బూడిద చేసింది. ఈ ఘటనలో 30 మందికిపైగా చనిపోయినట్టు చెబుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మానవ హక్కులను ఉల్లంఘించే అమానవీయ, క్రూరమైన ఈ హత్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.

మో సో పొరుగు గ్రామమైన కియో గాన్‌ గ్రామంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మార్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. ఈ క్రమంలో శిబిరాలకు పారిపోయిన శరణార్థులను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ప్రభుత్వ బలగాలు వారిని కాల్చి చంపాయి. అనంతరం మృతదేహాలను తాళ్లతో కట్టేసి వాహనాల్లో పడేసి నిప్పు పెట్టాయి. అయితే, మయన్మార్ మిలిటరీ కథనం మరోలా ఉంది. ప్రతిపక్ష సాయుధ దళానికి చెందిన ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు పేర్కొంది. వారు ఏడువాహనాల్లో ఉన్నారని, ఆగమన్నా ఆగకపోవడంతోనే కాల్పులు జరిపినట్టు తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించి మానవహక్కుల సంఘాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫొటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. కాలిపోయిన మృతదేహాలు, వాహనాల దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. జుంటా నాయకత్వంలోని సైన్యం ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. జుంటా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పౌర మిలీషియాల్లో పెద్దదైన కరెన్ని నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ ఘటనపై స్పందించింది. మృతులు తమ సభ్యులు కాదని, వారందరూ ఆశ్రయం పొందుతున్న శరణార్థులని స్పష్టం చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధుల మృతదేహాలను చూసి తాము షాక్‌కు గురైనట్టు పేర్కొంది.

శుక్రవారం రాత్రే తమకు ఈ విషయం తెలిసిందని, కాల్పుల భయంతో అక్కడికి వెళ్లలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని గ్రామస్థుడొకరు చెప్పారు. ఉదయం వెళ్లి చూసిన తమకు కాలిన మృతదేహాలు, వాహనాలు కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో వారి దుస్తులు, ఆహారం, మందులు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని తాను చూసినట్టు వివరించారు.
Myanmar
Military
Terrorists
Killed
Karen National Union
Aung San Suu Kyi

More Telugu News