Telangana: యూట్యూబ్ యాజమాన్యంతో మాట్లాడిన తెలంగాణ సర్కారు.. చానళ్ల పట్ల ఇకపై కఠిన వైఖరి
- బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చానళ్లపై చర్యలు
- నిలిపివేయాలని లేదా బ్లాక్ చేయాలని కోరనున్న సర్కారు
- సోమవారం లేఖ రాయలని నిర్ణయం
యూట్యూబ్ చానళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడి శరీరాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యానం ఈ పరిణామాలకు నేపథ్యంగా ఉంది. యూట్యూబ్ ఇండియా నిర్వహణ యజమాన్యంతో ఈ విషయమై అధికారులు ఇప్పటికే మాట్లాడారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి నిర్వహించే అన్ని చానళ్లు తమ నిర్వాహకుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై సోమవారం లేఖ కూడా రాయనున్నట్టు తెలిసింది.
నిబంధనలు పట్టకుండా ఇష్టారీతిన కంటెంట్ ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు చాలానే ఉంటున్నాయి. సుమారు 200కు పైగా యూట్యూబ్ చానళ్లు రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వీటిల్లో మెజారిటీ చానళ్లకు కార్యాలయ చిరునామా, నిర్వహణదారుల పేరు, చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ వివరాలు ఏవీ లేవని గుర్తించారు. పరువుకు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన కంటెంట్ ను ఈ చానళ్లు ప్రసారం చేస్తున్నాయని, అటువంటి చానళ్ల నిర్వాహకులను గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, కంటెంట్ తో సంబంధం లేని థంబ్ నెయిల్స్ పెడుతున్నట్టు, బాధ్యతారాహిత్యంతో ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్టు అధికారుల వాదనగా ఉంది. ‘‘ఇటీవల ఒక వివాహేతర సంబంధం కేసులో సబ్ ఇన్ స్పెక్టర్ ఫొటోకు బదులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫోటోను ఒక చానల్ చూపించింది. ఆ చానల్ ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. చిరునామా, ఫోన్ నంబర్లు లభించలేదు. ఇటువంటి వాటిని గుర్తించి, తొలగించేందుకు యూట్యూబ్ చాలా సమయం తీసుకుంటోంది’’అని తెలంగాణ డిజిటల్ మీడియా డెరెక్టర్ కొణతం దిలీప్ తెలిపారు.
ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేసే చానళ్లను నిలిపివేయడం లేదా బ్లాక్ చేసే విధంగా యూట్యూబ్ యాజమాన్యాన్ని లేఖ రూపంలో కోరాలని సర్కారు నిర్ణయించింది. ‘‘‘నా కుమారుడి పట్ల తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయి. బీజేపీ వాళ్లు దీన్ని ఆమోదిస్తున్నారా?? ఇదేనా మీ వాళ్లకు నేర్పే సంస్కారం??’’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటన కూడా చేశారు.