Prime Minister: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఒమిక్రాన్ దాకా.. ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో ప్రధాని చెప్పిన విషయాలివే
- ఒమిక్రాన్ మన తలుపు తట్టింది.. జాగ్రత్తగా ఉండాలి
- వరుణ్ సింగ్ ను గుర్తు చేసుకున్న ప్రధాని
- అంత ఎదిగినా మూలాలు మరచిపోలేదని ప్రశంస
- ఆయన రాసిన లేఖ కలచి వేసిందంటూ ఆవేదన
- ‘వందేమాతరం’ ఆలపించిన గ్రీకు విద్యార్థులు
ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రజలు పడుతున్న శ్రమ, ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా వ్యాక్సినేషన్, సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదం, స్వచ్ఛ భారత్ సహా ఎన్నో అంశాలను ఆయన స్పృశించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కొన్ని కోట్ల మంది శ్రమిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వారి కథలు విన్నప్పుడల్లా ఏదో స్ఫూర్తి నింపినట్టనిపిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి సహకారంతోనే వందేళ్లకోసారి వచ్చే ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోగలుగుతున్నామని చెప్పారు. భారత జాతి ఓ కుటుంబంలా నిలబడడం వల్లే మహమ్మారిపై గెలుపు దిశగా సాగుతున్నామని, వ్యాక్సినేషన్ లో కీలక మైలు రాళ్లను అధిగమించగలిగామని తెలిపారు. ఇప్పటిదాకా 140 కోట్ల వ్యాక్సిన్ డోసులను జనానికి ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. ఇంత వేగంగా వ్యాక్సినేషన్ ఏ దేశంలోనూ జరగలేదన్నారు.
ఒమిక్రాన్ ఇప్పటికే మన తలుపు తట్టిందని, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు. శాస్త్రవేత్తలంతా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పరిశోధనలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిరోజూ దానికి సంబంధించి కొత్త విషయాలు తెలుస్తున్నాయని, వాటికి తగిన సలహాలు, సూచనలు తీసుకుంటూనే ఉన్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ కట్టడికి సహకరించాలని, ఆ బాధ్యతతోనే ప్రతి ఒక్కరూ 2022లోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు.
భారత వైమానిక దళాన్ని ప్రశంసిస్తూ మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన హితబోధను ప్రధాని గుర్తు చేశారు. ‘గర్వంతో ఆకాశాన్ని అందుకోవాలి’ అంటూ శ్రీకృష్ణుడు చెప్పాడన్నారు. భారత వాయుసేన సిద్ధాంతం కూడా ఇదేనన్నారు. ప్రతిరోజూ ఎందరో భరతమాత ముద్దు బిడ్డలు ఆకాశాన్ని అందుకుంటున్నారన్నారు. అలాంటి ఓ వ్యక్తే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని కొనియాడారు.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరికొంత మంది సైనికులు చనిపోయారని, వరుణ్ సింగ్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో పోరాడినా చివరకు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పోస్టులు చూసి తన మనసు చలించిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఆయనకు శౌర్య చక్ర అవార్డు వచ్చినట్టు తెలిసిందని, ఆ వెంటనే ఆయన తన స్కూలు ప్రిన్సిపాల్ కు లేఖ రాశారని పేర్కొన్నారు. ఇంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మాత్రం ఆయన మరువలేదని ఆ లేఖ చదివాక తెలిసిందన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో బాగా సాగుతోందని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ‘సాఫ్ వాటర్’ అనే ఓ స్టార్టప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కృత్రిమ మేధ ద్వారా ఓ ప్రాంతంలోని నీటి స్వచ్ఛత, నాణ్యత గురించి అక్కడి ప్రజలకు తెలియజేస్తారని చెప్పారు. అది చాలా మంచి ఇనిషియేటివ్ అన్నారు. పోస్టల్ శాఖ ఆఫీసులోని జంక్ యార్డ్ లో స్వచ్ఛ డ్రైవ్ చేపట్టాక.. అక్కడ చెత్తాచెదారం ఏమీ లేదని, ఇప్పుడది అందమైన పెరడులా తయారైందని గుర్తు చేశారు. చెట్ల నుంచి రాలిపోయే ఎండుటాకులు, ఆర్గానిక్ వేస్ట్ తో పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ కంపోస్ట్ ఎరువులను తయారు చేస్తున్నారన్నారు.
కాగా, గ్రీక్ విద్యార్థులు ఆలపించిన వందేమాతర గీతాన్ని ప్రధాని ఆసక్తిగా విన్నారు. వారు పాడుతుంటే తమలోనూ కొత్త ఉత్సాహం పొంగుతోందన్నారు. ‘‘పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద కలలను కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలి. మన కలలు మన ఒక్కరికే పరిమితం కాకూడదు’’ అంటూ ప్రధాని నేటి తరానికి సూచనలు చేశారు.