Telangana: పాలిటెక్నిక్ మధ్యలో ఆపేసినా ఇంజనీరింగ్ సర్టిఫికెట్.. తెలంగాణలో కొత్త ప్రయోగం
- రెండేళ్లకు 90 క్రెడిట్స్ సంపాదిస్తే ఎగ్జిట్ అవకాశం
- ఇంటర్ కు సమానమైన అర్హత
- నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై సమాలోచన
- ఏడాది చేస్తే సర్టిఫికెట్, రెండేళ్లకు డిప్లొమా
తెలంగాణలో విద్యా శాఖ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. విద్యా కోర్సుల్లో ఊహించని మార్పులు, నవ్యతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్య మూడేళ్లు చదవడం ఇష్టం లేని వారికి రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ తీపి కబురు అందించబోతోంది. సాధారణంగా పాలిటెక్నిక్ కోర్సు మూడేళ్లు. కానీ, రెండేళ్లకు వైదొలిగే అవకాశం కల్పించనుంది. అటువంటి వారికి ఇంజనీరింగ్ లో సర్టిఫికెట్ కోర్సు ప్రదానం చేయనుంది. దీనివల్ల ఉపాధి కోసం వెళ్లాలనుకునేవారు వెళ్లిపోవచ్చు. లేదంటే సర్టిఫికెట్ ఆఫ్ ఇంజనీరింగ్ అర్హతగా మరేదైనా కోర్సులో చేరొచ్చు. ఇంటర్ కు సమానంగా దీన్ని గుర్తించాలని అధికారుల ప్రణాళిక.
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఈ తరహా సంస్కరణలను ముందుండి నడిపిస్తున్నారు. పాలిటెక్నిక్ లో సర్టిఫికెట్ పొందాలంటే రెండేళ్లలో మొత్తం 100 క్రెడిట్లకు 90 సంపాదించాల్సి ఉంటుంది. ప్రతీ సెమిస్టర్ కు 25 క్రెడిట్ల చొప్పున మూడేళ్ల డిప్లొమా కోర్సులో మొత్తం ఆరు సెమిస్టర్లు ఉండడం తెలిసిందే. మూడేళ్లు పూర్తి చేసుకున్న పాలిటెక్నిక్ అభ్యర్థులకు నేరుగా ఇంజనీరింగ్ డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం లభిస్తుంది.
ఇటీవలే నాలుగేళ్ల ఇంటెగ్రేటెడ్ డిగ్రీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం గమనార్హం. ఇక డిగ్రీ కోర్సులనూ కొత్త విధానంలో ఆఫర్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్స్ పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ ఇవ్వనున్నారు. మూడేళ్లకు డిగ్రీ, రెండేళ్లు చదివితే డిప్లొమా, ఏడాది చదివిన వారికి సర్టిఫికెట్ ను ప్రదానం చేయనున్నారు. త్వరలో ఈ మార్పులు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.