Ram Charan: మా తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడన్న సంగతి మా ఇంట్లో కొద్దిమందికే తెలుసు: రామ్ చరణ్
- విడుదలకు ముస్తాబైన 'ఆర్ఆర్ఆర్'
- జనవరి 7న ప్రేక్షకుల ముందుకు
- ప్రమోషన్ ఈవెంట్లతో చిత్ర బృందం బిజీ
- ఓ పుడ్ చాలెంజ్ లో పాల్గొన్న రామ్ చరణ్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఫుడ్ చాలెంజ్ లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమ కుటుంబ విషయాలు కూడా పంచుకున్నాడు.
తన తాతయ్య అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమర యోధుడు అని రామ్ చరణ్ వెల్లడించాడు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆయన హక్కుల కోసం పోరాడారని వివరించాడు. అందుకు గాను ఆయనను 15 రోజులకు పైగా కారాగారంలో ఉంచారని తెలిపాడు. ఈ విషయం తమ కుటుంబ సభ్యుల్లో కొద్దిమందికే తెలుసని రామ్ చరణ్ అన్నాడు.
అంతేకాదు, తన ఆహారపు అలవాట్లను కూడా చెర్రీ అభిమానులతో పంచుకున్నాడు. నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, అయితే హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టమని తెలిపాడు. తీరిక వేళల్లో ఇంట్లో సరదాగా వంట చేస్తుంటానని చెప్పాడు. కానీ ఇప్పటికీ వంట చేయడం సరిగా రాదని వెల్లడించాడు. స్వీట్ల కంటే కారంగా ఉండే పదార్థాలు ఎక్కువ తింటానని, ఇంట్లో అందరికంటే ఎక్కువగా మసాలా ఫుడ్ ఐటమ్స్ తింటుంటానని చరణ్ వివరించాడు. తాను తినే ఆహార పదార్థాల్లో మొక్కజొన్న లేకుండా చూసుకుంటానని, తనకు మొక్కజొన్న నచ్చదని పేర్కొన్నాడు.
తమ ఇంట్లో 'చిరు దోశ' ఎంతో ఇష్టంగా తింటుంటామని, అయితే తన తల్లి సురేఖ ఆ దోశ రెసిపీని తనకు ఇంతవరకు చెప్పలేదని అన్నాడు. గతంలో ఓసారి అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్లిన చిరంజీవి అక్కడి ఓ హోటల్లో తిన్న దోశను ఎంతగానో ఇష్టపడ్డారు. అలాంటి దోశనే ఇంట్లో తయారుచేసేందుకు ఎంతో కష్టపడ్డారు కూడా. తన అర్ధాంగి సురేఖ సాయం తీసుకున్న చిరంజీవి అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం తాను ఆనాడు తిన్న దోశ రుచికి దగ్గరగా ఉండే దోశను వేయగలిగారు. ఆ దోశ తదనంతర కాలంలో 'చిరు దోశ'గా ఎంతో పాప్యులర్ అయింది.