RBL Bank: ఆర్ బీఎల్ బ్యాంకులో ఏం జరుగుతోంది..? బోర్డులో అనూహ్యమైన మార్పులు

RBL Bank MD Vishwavir Ahuja steps down

  • బోర్డులో తన ప్రతినిధిని డైరెక్టర్ గా నియమించిన ఆర్బీఐ
  • సెలవుపై వెళ్లిపోయిన బ్యాంకు ఎండీ, సీఈవో విశ్వవిర్ అహుజా
  • తాత్కాలిక ఎండీ, సీఈవోగా రాజీవ్ అహుజా

క్రిస్మస్ పర్వదినం రోజున ‘ఆర్ బీఎల్ బ్యాంకు’లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముంబై ప్రధాన కార్యాలయంగా నడిచే ఈ బ్యాంకులో అదనపు డైరెక్టర్ గా యోగేష్ దయాళ్ ను నియమిస్తున్నట్టు ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. దయాళ్ ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఇప్పటి వరకు పనిచేశారు.  

ఆ తర్వాత అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ బ్యాంకు ఎండీ, సీఈవో విశ్వవిర్ అహుజా తక్షణమే సెలవుపై వెళ్లిపోయినట్టు ఆర్ బీఎల్ బ్యాంకు నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రాజీవ్ అహుజాను తాత్కాలిక ఎండీ, సీఈవోగా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. తక్షణమే సెలవుపై వెళ్లేందుకు అనుమతించాలన్న విశ్వవిర్ అహుజా అభ్యర్థనను మన్నించినట్టు ఆర్ బీఎల్ బ్యాంకు తెలిపింది. యోగేష్ కె దయాళ్ ను అడిషనల్ డైరెక్టర్ గా నియమించినట్టు ఆర్బీఐ నుంచి తమకు 24వ తేదీన సమాచారం అందినట్లు ప్రకటించింది.

కాకపోతే ఈ రెండు పరిణామాల వెనుక కారణాలు ఏమున్నాయనే విషయమై అటు ఆర్బీఐ నుంచి, ఇటు ఆర్ బీఎల్ బ్యాంకు నుంచి సమాచారం లేదు. సాధారణంగా బ్యాంకు కార్యకలాపాలు మరింత సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తేనే బ్యాంకుల బోర్డుల్లో ఆర్బీఐ తన ప్రతినిధులను డైరెక్టర్ లుగా నియమిస్తుంటుంది. గతంలో యస్ బ్యాంకు వ్యవహారంలోనూ ఇదే చూశాం. ‘‘బ్యాంకు నిబంధనల మేరకు సరైన సమాచారాన్ని వెల్లడించక పోయి ఉండొచ్చు. ఏదైనా కానీ, ఈ సమయానికి అసలు అంశం ఏంటన్నది మనకు తెలియదు’’ అని ఓ వెటరన్ బ్యాంకర్ పేర్కొన్నారు.

విశ్వవిర్ అహుజాకు మూడేళ్లపాటు పదవీకాలం పొడిగించాలన్న బ్యాంకు బోర్డు అభ్యర్థనను లోగడ ఆర్బీఐ తోసిపుచ్చింది. కేవలం ఏడాది పాటే పొడిగింపునకు (2021 జూన్ 30 నుంచి) అనుమతించింది. కరోనా తర్వాత ఆర్ బీఎల్ బ్యాంకు బ్యాలన్స్ షీటులో మొండి బకాయిలు భారీగా పెరిగి పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News