Harish Rao: కొమురవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్ రావు
- నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం
- విచ్చేసిన హరీశ్ రావు, తలసాని, మల్లారెడ్డి
- శివనామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి క్షేత్రం
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మలన్న స్వామి కల్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి కూడా ఉన్నారు. రెండ్రోజుల పాటు ఇక్కడి మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకగా కల్యాణోత్సవం నిర్వహించారు. రేపు ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన, మహా మంగళ హారతి ఉంటాయి.
కాగా నేటి కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావడంతో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం శివనామస్మరణతో మార్మోగిపోయింది. కాగా, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నేటి కల్యాణానికి హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు పక్కనే కూర్చుని ముచ్చటించడం అందరినీ ఆకర్షించింది.
హరీశ్ రావు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కృషి, మల్లన్న స్వామి అనుగ్రహంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయని తెలిపారు. గత ఏడేళ్లుగా ఇక్కడి ఆలయంలో రూ.33 కోట్లతో అభివృద్ధి చేశామని వెల్లడించారు.