Margani Bharat: హైదరాబాదులో ఉన్న సినీ పరిశ్రమకు 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వెళుతోంది: వైసీపీ ఎంపీ మార్గాని భరత్
- టాలీవుడ్, ఏపీ సర్కారు మధ్య రగులుతున్న టికెట్ల అంశం
- మరింత ఆజ్యం పోస్తున్న థియేటర్లలో తనిఖీల అంశం
- తెలుగు సినీ పరిశ్రమ ఏపీలో లేదన్న రాజమండ్రి ఎంపీ
- ఏపీలో తెలుగు సినీ పరిశ్రమను స్థాపించాలని సూచన
సినిమా టికెట్ల వ్యవహారం, థియేటర్లలో అధికారుల తనిఖీలు, మూసివేత తదితర అంశాలతో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య వాడివేడి వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ యువ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో ఉంది, ఏపీలో కాదు అని స్పష్టం చేశారు. కానీ సినీ పరిశ్రమకు 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వెళుతోందని వెల్లడించారు. లైట్ బాయ్ నుంచి అగ్రహీరోల వరకు ఏపీ నుంచి అందుతున్న ఆదాయంతో లబ్దిపొందుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థాపనకు టాలీవుడ్ పెద్దలు ముందుకు రావాలని మార్గాని భరత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా సరళమైన పన్నుల శ్లాబులపై కసరత్తులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.