Natti Kumar: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టును ఆశ్రయిస్తా: నట్టి కుమార్
- తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు
- చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న నట్టి కుమార్
- ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి
- కేసీఆర్, తలసాని లాజిక్ మిస్ అయ్యారని వెల్లడి
ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న తెలంగాణ సర్కారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో నెం.120 తీసుకువచ్చిందని, అయితే ఇది చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు. పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉంటే చిన్న సినిమా బతికి బట్టకట్టేదెలా అని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా సినిమా టికెట్ ధరలపై పునరాలోచించుకోవాలని, లేకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టి కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాళ్లిద్దరికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్ల మల్టీప్లెక్స్ లో సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందినవారేనని, అయితే సినిమా టికెట్ల అంశంలో వారు లాజిక్ మిస్ అయ్యుంటారని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే చిన్న సినిమాలకు అన్యాయం జరిగే నిర్ణయం వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు.